Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘గండేపల్లి’ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, ఉద్యోగాలిస్తాం: ఏపీ ఆర్థిక మంత్రి యనమల

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో చనిపోయిన కూలీల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఆయన హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీసిన ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సీఎం నారా చంద్రబాబునాయుడితో మాట్లాడి ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. పరిహారాన్ని పెంచే విషయాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాల్లో విద్యావంతులుంటే ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తామని ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలను ఉచితంగానే అందజేస్తామని వెల్లడించారు.

More Telugu News